close

తెలంగాణ

ఆగని వ్యసనోత్పాతం..!

కల్తీ కల్లు దొరక్క ముగ్గురి బలవన్మరణం.. అస్వస్థతతో మరో ముగ్గురి మృతి

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం: లాక్‌డౌన్‌తో మద్యం, కల్తీ కల్లు లభించకపోవడంతో ఎంతోమంది మతి తప్పి ప్రవర్తిస్తున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా.. మరికొందరు అస్వస్థతకుగురై మృత్యువాతపడుతున్నారు. మంగళవారం ఒక్క సంగారెడ్డి జిల్లాలో ఇలా ఐదుగురు మరణించారు. సంగారెడ్డి మండలం కల్పగూర్‌కి చెందిన మంగలి రాములు (75) కల్లు లేకపోవడంతో కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. వింతగా ప్రవర్తిస్తూ అదృశ్యమై ఆత్మహత్య చేసుకున్న పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ వాసి భవానికృష్ణప్రసాద్‌(33) మృతదేహాన్ని గ్రామసమీపంలో తాజాగా గుర్తించారు.

ఆందోల్‌ మండలం మన్సాన్‌పల్లికి చెందిన సత్తెయ్య(57) ఇస్నాపూర్‌ పెద్ద చెరువు వద్ద చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొండాపూర్‌ మండలం గిర్మాపూర్‌కి చెందిన లక్ష్మీనారాయణ(30) వింతగా ప్రవర్తిస్తూ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు. కల్లు దొరక్క కొండాపూర్‌ వాసి ఎ.నాగయ్య (75) పాడుబడ్డ బావిలో దూకి మృతిచెందాడు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఆలూర్‌లో అస్వస్థతకుగురై రాము(34) అనే వ్యక్తి మరణించాడు.

కల్తీ కల్లు తాగి 27 మందికి అస్వస్థత.. వృద్ధురాలు మృతి
వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం చించల్‌పేటలో కల్తీ కల్లు తాగి 27 మంది అస్వస్థతకు గురవగా.. ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఆదివారం సాయంత్రం వీరంతా కల్లు తాగారు. వీరిలో 15 మంది పురుషులు, మిగతా వారంతా మహిళలు.

ఎర్రగడ్డకు ఒకే రోజు 180 మంది బాధితుల రాక
హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి బాధితులు పోటెత్తుతున్నారు. ఆల్కాహాలిక్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌గా పిలిచే ఈ సమస్యతో మంగళవారం ఏకంగా 180 మంది ఆసుపత్రిని ఆశ్రయించారు. తాజాగా వచ్చిన బాధితుల్లో 48 మందిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. మరో 80 మందిని పరిశీలనలో ఉంచామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఉమాశంకర్‌ తెలిపారు.


వెంటనే ఆసుపత్రికి తరలించాలి

* డైజోఫాం, క్లోరోహైడ్రేడ్‌ కలిపిన కల్లు తాగే అలవాటుండి.. ఒక్కసారిగా అది దొరక్కపోయే సరికి ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోంది. దీన్నే ఆల్కాహాల్‌ విత్‌డ్రాల్‌ డెలీరియంగా వ్యవహరిస్తారు. ప్రతి పది మందికాగాను ముగ్గురిలో ఇది ప్రమాదకరంగా మారుతుంది.
* కల్లు మానేసిన 48 గంటల తర్వాత లక్షణాలు బయటపడతాయి. ఒక విధమైన గందరగోళానికి గురై మెదడుకు రక్త సరఫరా తగ్గిపోతుంది.
* డోపమైన్‌ మెదడులో ఎక్కువగా విడుదల కావడంతో శరీరంపై పట్టు తప్పుతుంది. మూత్రపిండాలు, గుండె,మెదడుపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మహత్యలు చేసుకోవడం, ఇతరులపై దాడి చేయడం లాంటి ఘటనలకు పాల్పడుతుంటారు.
* బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలిస్తే.. యాంటీ డెలీరియం ఔషధాలతో నియంత్రణలోకి తీసుకురావొచ్చు.

-డాక్టర్‌ కె.శ్రీనివాస్‌, న్యూరో సైక్రియాటిస్టు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు